హాస్యకథలు


వంట నేర్చిన భర్త

     ఆదివారం తీరిక సమయం కావడంతో భర్త విశ్వనాధం తో కలిసి టి.వి. ముందు కూర్చుంది వనజ. టి.వి. లో వంటల కార్యక్రమం వస్తుంది. టి.వి. యాంకర్ నీట్  గా మేకప్పయి "చికెన్ ఛం ఛం"  ఎలా చేయాలో ఇప్పుడు మనకు వంటలమ్మ గారు చెపుతారంటూ ఎప్పటిలాగే వయ్యారాలు పోయింది. వనజ కళ్ళప్పగించి  చూడసాగింది. 
     

     వంటలమ్మ గారు గరిట  అందుకొని " ఈ చికెన్ ఛం ఛం చేయడానికి ఏం కావాలో చెపుతాను లొట్టలేసుకుంటూ చూడండి.  అరకిలో చికెన్ -50 గ్రాముల నూనె - రెండు ఉల్లిపాయలు - నాల్గు పచ్చిమిర్చి -50 గ్రాముల జీలకర్ర - తగినంత ఉప్పు-రెండు చెంచాల కారం - 100 గ్రాముల గరం మసాల ముద్ద" అని గట్టిగా ఊపిరి పీల్చుకుని, "మరి ముఖ్యంగా ఈ వంట చేయడానికి కావల్సింది వంట బాగా తెల్సిన ఓ మంచి భర్త." అంటూ  ముగించింది. 
     వనజ భర్త వైపు చూసి, "ఆవిడ చెప్పింది బాగా అర్ధమైందా?" అన్నట్లు కనుబొమ్మలెగరేసింది.
అతడు ఆమెను గుర్రుగా చూస్తుండిపోయాడు.  

 పాపం సుబ్రావ్...!

      పెళ్ళికాని సుబ్బారావు తన ఆఫీసులో కొత్తగా చేరిన కమలను ప్రేమించాడు. కాని, అమె మెడలో మంగళ సూత్రం, కాళ్ళకు మెట్టెలు చూసి ఆశ చాలించుకున్నాడు. అలా రెండు మూడు సంవత్సరాలు గడచిపోయాయి. గడచిపోయిన కాలంలో రోజూ తను గాని, ఆఫీసులోని మిగిలిన స్టాఫ్ గాని, కమల భర్త ను చూసిన పాపాన పోలేదు. దాంతో అందరికీ కమల మీద అనుమానం మొదలయ్యింది. నిజంగానే కమలకు పెళ్ళయ్యిందా? లేక ఆయినట్లు ందరిని నమ్మించడానికి అలా తాళి, మెట్టెలు వేసుకు తిరుగుతుందా? అని. వాళ్ళ గుసగుసలు విన్న మన సుబ్బారావు మనసులో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి.

      ఇక లాభం లేదు, ఏమైతే అదే అయింది వెళ్ళి అడిగేద్దామని ఆఫీసు సెలవు రోజున ధైర్యం చేసి కమల ఇంటికి వెళ్ళాడు. గుమ్మం ముందు నిలబడిన సుబ్బారావు ను చూసి, ఆశ్చర్యపోతూ... లోపలికి ఆహ్వానించింది కమల. హాల్లో కూర్చుని సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్న సుబ్బారావుకు కాఫీ ఇచ్చి "ఏమిటి ఇలా వచ్చారు?" అనడిగింది. ఆమె ప్రశ్నకు కొంచెం సేపు తటపటాయించి...ఆఫీసులో అందరూ కమల గురించి అనుకుంటున్న గుసగుసల గురించి చెప్పాడు సుబ్బారావు.

      కమల నవ్వింది. ఇలా రండి మా ఆయనను చూపిస్తా... అంటూ సుబ్బారావును డ్రాయింగ్ రూం లోకి తీసుకెళ్ళింది. "ఇతనే నా భర్త..." అంటూ ఏదో చెపుతూ... గోడ మీద తగిలించిన ఫోటోస్ ని చూపించింది. అంతే... కెవ్వు మని కేక వేసి స్పృహ తప్పి పడిపోయాడు సుబ్బారావు.

గోడ మీది ఫోటోలలో ఉన్నది... స్వర్గీయ "యస్. వి. రంగారావు..." ????

( ఎప్పుడూ సినిమాలు చూడని కమల అప్పుడెప్పుడో సినిమా పత్రికలో అతన్ని చూసి మనసు పడిందట...! అప్పటినుండి అతడినే తన భర్తగా ఊహించుకుంటూ... అతని భార్యగా బ్రతికేస్తుందట... తన ప్రేమబలం...ఎప్పటికైనా అతడిని తనకు చేరువ చేస్తుందని ... ఆమె ప్రగాఢ నమ్మకం మరి....!)


ఆటోవాలా ఆఫ్ హైదరాబాద్ 

      ఒక పల్లెటూరి నుండి ఒక కుక్క(శునకం) కొత్తగా హైదరాబాద్ చేరుకుని, అక్కడి లోకల్ కుక్కలతో కలిసి నివసించసాగింది...ఒకరోజు మిగిలిన కుక్కలన్నిటి తో పాటు... తను కూడా ఒక రోడ్డుపై పడుకొంది. అయితే, అది మెయిన్ రోడ్డు కావడంతో వచ్చే పోయే వాహనాలతో కొంత రద్దీ గానే ఉంది. అంతలో ఒక బస్సు రయ్యిన రోడ్డుపై దూసుకు రావడంతో కుక్క భయంతో లేచి పక్కకు పరుగెత్తింది. దాన్ని చూసి మిగిలిన కుక్కలు...పగలబడి నవ్వాయి. "ఎహే... నువ్వు నిజంగా పల్లెటూరి మొద్దువే... మేం ఏమైనా లేచామా...? ఏమీ కాదు పడుకో" అని సలహా ఇచ్చాయి. అది మళ్ళీ పడుకుంది. ఈసారి ఒక పెద్ద లారీ అటువైపు దూసుకొచ్చింది. అన్ని కుక్కలు కదలకుండా అల్లాగే పడుకొనివుంటే... కుక్క మాత్రం... మళ్ళీ భయంతో లేచి పక్కకు పరుగెత్తింది. మళ్ళి అన్ని కుక్కలూ దాన్ని పల్లెటూరి శుంఠ... అని తిట్టి పోసాయి. ఇలా... నాలుగైదు సార్లు... ఏదో ఒక భారీ వెహికిల్ రావడం... అది అలా పరుగెత్తడం... మిగిలిన వాటితో తిట్లు తినడం జరిగేసరికి... కుక్కకు క్రమంగా భయం తేలిపోయింది. ఇక ధైర్యంగా పడుకుంది. సరిగ్గా అదేసమయంలో ఒక ఆటో రివ్వున మీదకొచ్చింది. కుక్క తనకేం సంబంధం లేనట్లు అలా పడుకొని చూస్తూ ఉండిపోయింది... కానీ విచిత్రం, మిగిలిన కుక్కలు భయంతో లేచి కకావికలుగ అటూ ఇటూ పరుగెత్తుకు పోయాయి. ఇది కదలకుండా ఉండడంతో, ఆటో రావడం... దీన్ని గుద్ది వెళ్ళిపోవడం జరిగిపోయాయి. పాపం బాగా దెబ్బలు తగలడంతో...కుయ్యో... మొర్రో అంటూ లేచి, రోడ్డు పక్కన నిలబడి చోద్యం చూస్తున్న మిగిలిన కుక్కల దగ్గరకు పోయి బావురుమంది.. "ఇందాకటినుండి నేను లేచి పరుగెడుతుంటే తిట్టారు. ఇప్పుడు ఏం కాదు కదా అని నేను పడుకుంటే... మీరు పక్కకు తప్పుకున్నారు" అంది... నిష్టూరంగా...

అప్పుడు వాటిల్లోని ఒక సీనియర్ కుక్క ముందుకొచ్చి... "బస్సు డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు వాళ్ళు ఎలా వెళ్ళాలో... ఎటు వెళ్ళాలో వాళ్ళకి బాగా తెలుసు. వారితో మనకు సమస్య ఏమీ ఉండదు. కానీ హైదరాబాదు ఆటో డ్రైవర్లు ఉన్నారే... వాళ్ళు ఎటు వెల్తున్నారో...ఎందుకు వెల్తున్నారో వారికే తెలియదు... కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్త గా ఉండాలి" అన్నది...
అదీ సంగతి !!!

 

1 కామెంట్‌: