కరకరలు (జోకులు)


                                      ఆపరేషన్ ... యమ...

మొదటిడాక్టరు  : నా పాతికేళ్ళ సర్వీసులో ఎన్నోవందల  ఆపరేషన్లు చేసి ఉంటాను గాని, ఒక్కసారి కూడా కుట్లు వేసే అవసరం రాలేదు. 
రెండవ డాక్టరు   : అదెలా సాధ్యం..? ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించావా.. ?
మొదటి డాక్టరు : టెక్నాలజీనా తొక్కా... ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు ఒక్క పేషంట్ అయినా బ్రతికితే కదా..!!

                                            ఫ్రీ టైం

కిరణ్ : ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్నికలవాలి.మీరు ఆఫీసులో ఏ సమయంలో ఖాళీ గా ఉంటారు సార్...?
సుబ్బారావు : ఉదయం నుండి సాయంత్రం వరకూ నిద్రకు నిద్రకు మధ్య లంచ్ టైం ఉంటుంది. భోజనం తరువాత ఓ రెండు నిమిషాలు వక్కపొడి నములుతాను. అప్పుడు కలువు...చూద్దాం...!




                                     తెలుసా...?

సుబ్బారావు : రాత్రి మా ఆవిడను తిట్టిన తిట్టు తిట్టకుండా చడా మడా నాలుగు  తిట్టేసి, రెండు చెంపలు వాయగొట్టేసాను తెలుసా...?
అప్పారావు : నిజమా...? మరి  ఆవిడ ఊరుకుందా...?
సుబ్బారావు : ఊరుకోక ఏం చేస్తుంది... ఇదంతా జరిగింది రాత్రి కలలో కదా మరి ...!!! 
 
                                              కవిత... 
                                                           (అప్పుడే అఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్తతో...) 
 శాంతి   : ఏమండీ... రాత్రంతా కష్టపడి ఒక పేద్ద కవిత రాసాను వినండి...
శ్రీధర్    : ఒక్క నిమిషం ఆగు...వచ్చేటపుడు అమ్మానాన్నని చూసి వచ్చాను.అన్నయ్య అక్కవాళ్ళతో   
                  కూడా మాట్లాడాను...
శాంతి : ఏం ఎందుకు...?
శ్రీధర్ : ఆ... అన్నట్లు, ఇక్కడ ఉన్న ఇళ్ళు నీ పేరిట రాసేసాను. ఊళ్ళో ఉన్న రెండు ఇళ్ళు అమ్మాయికి, అబ్బాయికి...
శాంతి : అదేమిటి...?
శ్రీధర్ : బ్యాంకు లో మీ ముగ్గురి పేరిట అక్కౌంట్స్ లో డబ్బులున్నాయి... ఆ అక్కౌంట్ బుక్స్ మన బెడ్ రూం లోని బీరువాలో సీక్రేట్ సొరుగులో పెట్టాను.
శాంతి : ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నారు...?
శ్రీధర్ : ఆగాగు... ఒక్కసారి పిల్లల్ని కూడా చూసుకుని వచ్చేస్తాను... మధూ... సందీప్ ఎక్కడున్నార్రా....?
శాంతి : ఏమైందండి... ఏమిటిదంతా...?
శ్రీధర్ : ఏమో శాంతీ... నేను లేకుండా ఎలా బ్రతుకుతావో ఏమిటో... అసలే ఆ పిచ్చి కవితలు రాసుకుంటూ బ్రతికే పిచ్చి మాలోకానివి...కానీ, ఏం చేద్దాం... ఊ...ఇప్పుడు చదువు నీ “పేద్ద కవిత...”
శాంతి : !!!???!!!


                                          సేఫ్టీ...

చంద్రం : రాత్రిళ్ళు వరదల్లో కొట్టుకుపోతున్నట్లు పీడకలలొస్తున్నాయి డాక్టరు గారు...
డాక్టర్ : లైఫ్ జాకెట్ వేసుకొని, పడవ లో పడుకొండి...  

                                     హృదయం 
డాక్టర్ : నీకు హార్ట్ ఆపరేషన్ చేయాలయ్యా...ఎల్లుండి అన్ని ఏర్పాట్లు చేసేస్తాం. నువ్వు వచ్చేయ్...
రాము : సరే డాక్టర్...!
( ఆపరేషన్ చేయాల్సిన రోజు తన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాడు రాము.)
రాము : నా హృదయం ఈవిడకిచ్చేసాను. తనకు చేయండి డాక్టర్... ఆపరేషన్ !
డాక్టర్ : ???!!!???
 
                                  సిలిండరు
శ్రీధర్ : సరళా ... ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ గ్యాస్ సిలిండరు మీద నీ చీర ఆరెయ్యొద్దని...
సరళ : ఇప్పుడు  ఏమయ్యిందండి ...?
శ్రీధర్ : నువ్వనుకుని ఆ  సిలిండర్ ని వాటేసుకున్నాను...!
సరళ : ???
 
                                  తుమ్మమొద్దు
కాంతం : (గోముగా)  ఏమండీ...నేను ఇరవై రోజులు పాటు ఊరెళ్తున్నాను కదా...!
అప్పారావు : ఊ...

కాంతం : పాపం నన్ను చూడకుండా  ఎలా ఉండగలరూ...?
అప్పారావు : ఫర్వాలేదులే కాంతం... మన దొడ్లో... ఆ మూలకు ఓ నల్లతుమ్మమొద్దు ఉందిగా... నువ్వు
                         వచ్చేదాక దాన్ని చూసుకుంటూ బ్రతికేస్తాలే...!!!



                            చూసుకుంటాను
                  పెళ్ళయిన కామాక్షి, పెళ్ళికాని మీనాక్షి క్రొత్తగా స్నేహితులయ్యారు.
మీనాక్షి : ఈ వీధి చివర మీ ఇంటి వైపునుండి వచ్చే ఒకాయన రోజూ మా ఇంటి ముందు నుండి ఆఫీసుకు
            వెళ్తుంటాడు.
కామాక్షి : ఊ... 
మీనాక్షి : రోజూ నావంక చూసి నవ్వుతుంటాడు. చాలా బాగున్నావని సైగలు చేస్తుంటాడు... 
కామాక్షి : ఆహా...! 
మీనాక్షి : ఈ రోజు ఉదయం ఐ లవ్ యూ కూడా చెప్పాడు.
 కామాక్షి : ఎలా ఉంటాడూ...? 
మీనాక్షి : చాలా బాగుంటాడు. ఎత్తుగా, ఎర్రగా, గిరజాల జుట్టు... 
కామాక్షి : మీసాలు ఒత్తుగా ఉంటాయా...? 
మీనాక్షి : హ హ... అవును. 
కామాక్షి : ఈ రోజు బ్లూ షర్ట్, వైట్ పాంట్ వేసుకున్నాడా? (అనుమానంగా) 
మీనాక్షి : అవునవును నువ్వు చూసావా...? 
కామాక్షి : లేదు ఇప్పుడు చూసుకుంటాను.( పళ్ళు పట పట లాడిస్తూ... అంది గుర్రుగా)
         ఆయన కామాక్షి వాళ్ళాయన మరి...!!!!
 


                                       కట్టెయ్యొచ్చు...
లక్ష్మి      : (పాట పాడుతూ ఉంది) “ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా...నువ్వొస్తానంటే నేనొద్దంటానా...?” 
శ్రీను       : లచ్చూ... నువ్వు బయట పాడే కంటే... ఏ రేడియోలోనో, టి.వి. లోనో పాడితే చాలా
              బాగుంటుంది.
లక్ష్మి       : (ఉత్సాహంగా) ఏం... ఎందుకనీ...! 
శ్రీను       : రేడియో గాని, టి.వి. గాని అయితే వినడానికి కష్టంగా ఉన్నపుడు, కనీసం కట్టేయ్యడానికి
              వీలుంటుంది. ఇప్పుడా అవకాశం లేదుగా...(అన్నాడు బాధగా)
   















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి